తానా సహకారంతో ప్రచురిస్తున్న కథ 2020 ఆవిష్కరణ
తానా సహకారంతో ప్రచురిస్తున్న కథ 2020 ఆవిష్కరణ
గత ముప్పై సంవత్సరాలుగా వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకత్వంలో వెలువడుతున్న సాంవత్సరిక ఉత్తమ కథాసంకలనం కథ 2020 ఆవిష్కరణ హైదరాబాదులో జరిగింది. కథ 90 సంకలనం 1991 డిసెంబర్లో విడుదలయిన దగ్గరనుంచి ఈ 31 సంవత్సరాలుగా నిరాటంకంగా వెలువడుతూనే ఉంది. గత ఇరవై సంవత్సరాలుగా తానా కొంత ఆర్ధిక సహకారం అందించడంతో ఈ సంకలనాలు తక్కువ రేటుకే పాఠకులకి అందజేయగలుగుతున్నారు.
రెండు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలలో కథ సంకలనం ఆవిష్కరణలు పండుగ వాతావరణంలో జరుగుతుండేవి. ఈ సంవత్సరం కథ 2020 కరోన నిబంధనల కారణంగా హైదరాబాదులో డిసెంబర్ 26, 2021న ప్రెస్ క్లబ్లో నిరాడంబరంగా ఉత్సాహ పూరిత వాతావరణంలో ప్రముఖ కథ, నవలా రచయిత మధురాంతకం నరేంద్ర ఆవిష్కరించారు.
తొలుత రచయిత కె.ఎమ్. మునిసురేష్ పిళ్లే అతిథులను, వక్తలను వేదిక మీదికి ఆహ్వానించారు. సభకు ప్రముఖ కథకులు ఆడెపు లక్ష్మీపతి అధ్యక్షత వహించగా, ఆత్మీయ అతిథులుగా ప్రముఖ కవి కె. శివారెడ్డి, కార్టూనిస్ట్ నర్సిం, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 'నిర్వాహకురాలు గీతా రామస్వామి ఈ సభలో పాల్గొన్నారు.
గత ముప్పై సంవత్సరాల ప్రచురణ అనుభవా లను, కథల ఎంపిక ప్రమాణాల గురించి కథాసాహితి సంపాదకులు వాసిరెడ్డి నవీన్ తన క్లుప్త ప్రసంగంలో వివరిస్తూ, కథల ప్రమాణాలు రానురాను తగ్గిపోవ టానికి కారణాలను విశ్లేషించారు.
మానవ జీవితంలోని అన్ని పార్శ్వాలను ప్రతిబిం బిస్తున్న తెలుగు కథ కొత్త సరిహద్దుల్లోకి ప్రవేశించిం దాని. తెలుగు కథ కొత్త పుంతలు తొక్కుతోంది అని అనడానికి కథాసాహితి సంకలనాలు నిదర్శనం అని ఆడెపు లక్ష్మీపతి అన్నారు.
సాహిత్య ప్రమాణాలు పెంచటంలో కథాసాహితి కృషి ప్రత్యేకమైందని, డిజిటల్ మాధ్యమాల వేదికగా వస్తున్న కథల్లో ప్రమాణాలు లోపిస్తున్నాయని కథ 2020 ఆవిష్కరించిన మధురాంతకం నరేంద్ర అభిప్రాయపడ్డారు..
ప్రముఖ కవి శివారెడ్డి మాట్లాడుతూ, ఇతర భాషలకు తీసిపోని విధంగా తెలుగు కథ ఎదిగిందని, గత మూడు దశాబ్దాలుగా సమాజంలో చోటు చేసుకున్న సామాజిక, సాంస్కృతిక పరిణామాలకు కథా సాహితి సంకలనాలలోని కథలు అద్దం పడతాయని అన్నారు.
చిత్రకారుడు నర్సిం కథతో తన అనుబంధాన్ని వివరించగా, గీతా రామస్వామి తెలుగు పాఠకుల సంఖ్య తగ్గిపోవటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ కథావిశ్లేషకులు ఎ.వి. రమణమూర్తి ఈ సంకలనంలోని పన్నెండు కథలను సోదాహరణంగా విశ్లేషించారు.
కథాసాహితి సహ సంపాదకుడు పాపినేని శివశంకర్ ఆన్లైన్లో మాట్లాడుతూ, ఈ సంకలనా లతో అనేకమంది కొత్త రచయితలు కథా రచనకు శ్రీకారం చుట్టారని, అనంతరం వారు మంచి కథకులు గా రూపొందారని అంటూ, తానా చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఈ కథానంకలనంలోని కథా రచయితలు వాడ్రేవు వీరలక్ష్మీదేవి, తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి, అఫ్సర్, బమ్మిడి జగదీశ్వరరావు, కుప్పిలి పద్మ, పాపినేని శివశంకర్, డా॥ కె.వి. రమణరావు, మహమ్మద్ ఖదీర్ బాబు తమ కథల నేపథ్యాన్ని వివరించారు. మృణాళిని రాసిన కథా నేపథ్యాన్ని వాసిరెడ్డి నవీన్ చదివారు.
ప్రసిద్ధ తెలుగునాటకాల పరిచయ సభ
తానా, అరవింద ఆర్ట్స్ సంయుక్తంగా ప్రచు రించిన బృహద్ నాటక సంకలనం 'ప్రసిద్ధ తెలుగు నాటకాలు' పరిచయసభ విజయవాడలో జరుగుతున్న 32వ పుస్తక మహోత్సవంలో జనవరి 7న జరిగింది.
ఈ సంకలనాలకు నాటక, కథారచయిత వల్లూరు శివప్రసాద్, నాటకప్రయోక్త గంగోత్రి సాయి సంపా దకులు. దాదాపు 5000 పేజీలున్న ఈ నూరు నాటకాల సంకలనం 6 సంపుటాలుగా వెలువడటం భారతీయ నాటకరంగ చరిత్రలో అరుదైన సంఘటనగా పాల్గొన్న వక్తలు అభిభాషించారు. ఈ సభలో ప్రముఖ కవి కె. శివారెడ్డి, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, డా॥ బి. జయప్రకాష్, హెచ్.ఆర్.ఎస్. ప్రసాద్ పాటు సంపాదకులిద్దరూ పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్ట్‌కి ఆర్థిక సహకారం అందించిన కొడవళ్ల హనుమంతరావు వితరణ అభినందనీయం.