Sirivennela Samagra Sahityam

‘సిరివెన్నెల’ గా అందరికీ తెలిసిన శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి గార్ని గూర్చి రాయడం అంటే ఒక మహా పర్వతాన్ని అద్దంలో చూపించే ప్రయత్నం చెయ్యడమే. పాటల పారిజాత వనంలో ‘సిరివెన్నెల’ ఓ మంచి గంధపు చెట్టు. సిరివెన్నెల కలం నుండి జాలువారిన అక్షరాలు వెన్నెల్లో ఆడపిల్లల్లా నాట్యాలు చేస్తాయి. అక్షరాలు త్రాసులో తూచినట్లు పాటలో చక్కగా ఇమిడి పోతాయి. సంగీత స్వరాలు ఆ అక్షరాలతో సంగమమై సరికొత్త రాగాలు తీస్తాయి. ఆయన ఒక గంభీర సాగరం. అలనాడు ఆ సాగర మధనం లో పుట్టింది అమృతం తో పాటు హాలాహలం అయితే, ఈనాడు ఈ సిరివెన్నెల మధనం లో పుట్టంది అమృతం తో పాటు కోలాహలం. ఆయని ప్రతి పాటా అందరికీ ఒక పండగే, ఒక సంబురమే! ఎదురుగా కనకరాసులు కవ్విస్తున్నా- నిగ్రహంతో, నిబద్ధతతో గీత దాటకుండా రాసిన గీత రచయిత ఆయన. సిరివెన్నెల పాట ఒక పన్నీటి జల్లు. ఒక పాటలో ప్రకృతి పులకరింత, ఒకపాటలో తొలకరి పలకరింత, ఒక పాటలో ఆర్తి, మరో పాటలో స్ఫూర్తి, ఒక పాటలో లాలింపు, మరో పాటలో మందలింపు. పాటల్లో శృతి మించని శృంగారం. ప్రతి పాటా ఒక చైతన్యం, ఒక సంచలనం, ఒక ప్రభంజనం. నిరాశ, నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్న యువతకు సిరివెన్నెల పాట ఒక ఆశ, ఆసరా. ఆ పాటలు నిద్రాణమై ఉన్న శక్తిని తట్టి లేపి సామాజిక బాధ్యత తో కూడిన గమ్యానికి దారి చూపుతాయి. సిరివెన్నెల కలం సినిమా పాటల గౌరవాన్ని పెంచింది. అందరూ విన్నవి ఎన్ని వేల పాటలో! ఇంకా వెలుగు చూడని పాటలు ఎన్నో! కేవలం సినీ గీతాలేగాక ఆయన కలంనుంచి వెలువడిన కథలు, కవితలు మరెన్నో! అన్నీ ఎప్పటికీ వన్నె తగ్గని ఆణిముత్యాలు.
పాట రాసేముందు ఆయా పాత్రల స్వభావాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడంలో సిరివెన్నెల పెట్టిన సమయం, చూపిన శ్రద్ధ ప్రతి ఒక్కరూ గమనించదగ్గది. అందుకే ఆయన పాటలలోని ప్రతి అక్షరమూ జీవంతో తొణికిసలాడుతూంటుంది.
సినీ కవి కలానికి రెండు పాళీలు తప్పనిసరి. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవ చ్చవాన్ని’ అంటూ ఒక పాళీ కదం తొక్కితే – ‘బలపం పట్టి భామ బడిలో’ అంటూ మరో పాళీ సయ్యాటలాడుతుంది. ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందమా’ అని నిలదీసిన కలమే – ‘శివానీ భవానీ శర్వాణీ’ అని భక్తితత్వాన్నీ ఆశ్రయిస్తుంది. నిర్మాతలు అడగ్గానే ఒక్కోసారి ఒక్కపాటకు దోసెడు పల్లవులు ఒలికించిన ఘనత శాస్త్రిగారి కలానిది. కావ్య హేతువులైన వ్యుత్పత్తి, ప్రతిభ, అభ్యాసం మూడూ సమపాళ్ళలో రాణించడం కవి యోగ్యతకు గుర్తు. ఆ యోగ్యత సిరివెన్నెల పాటలలో కన్పిస్తుంది. ఇవి సినీ గీతానికి కావ్య గౌరవం ఆపాదిస్తాయి. ‘తెలవారదేమో స్వామి’ అన్న అన్నమయ్య పల్లవిని ఎత్తుకుంటే చాలదు. ఆ పలుకు నిలదొక్కుకోవాలి. అది చేతనైతేనే ‘చెలువమునేలగ చెంగట లేవని, కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలమేలుమంగకు ...’ అంటూ పాటను పోషించడమూ తెలుస్తుంది. సిరివెన్నెల రాసిన ఈ పాట మొత్తం అన్నమయ్య రాసినదేమో అనిపింపజేస్తుంది. ఈ పాట పాడిన కె.జె. ఏసుదాసుకే అనిపించింది - అలా!
సిరివెన్నెల కురిపించిన సాహిత్యం మొత్తాన్ని సినిమా, సినిమాయేతర సాహిత్యం గా విభజించి - ప్రథమ ప్రయత్నంలో ఇప్పటివరకూ సినిమాలలో వచ్చిన సిరివెన్నెల మొదటి పాటనుండి, చివరి పాటవరకు అన్నింటినీ సేకరించి, పరిష్కరించి, కాలక్రమానుగుణంగా క్రోడీకరించి, మొత్తం నాల్గు గ్రంథాలు గా సిరివెన్నెల అభిమానులకు, సాహితీ పరిశోధకులకు తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ద్వారా అందజెయ్యాలనేది మా సంకల్పం. మా ఈ ఆలోచనకు సిరివెన్నెల కుటుంబ సభ్యుల అంగీకారం, ముఖ్య సంపాదకునిగా భాద్యతలు తీసుకోవడానికి అంగీకరించిన ప్రియమిత్రుడు కిరణ్ ప్రభ, ఈ ప్రయత్నంలో చేయి చేయి కలిపి పనిచేసిన సిరివెన్నెల సైన్యం, అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రోత్సహించే తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, నేను అడగంగానే ఆర్ధిక సహకారం అందించిన సన్నిహిత మిత్రుల సహాయం ఎన్నటికీ మరువలేనిది. ద్వితీయ ప్రయత్నంలో సిరివెన్నెల సినిమాయేతర సాహిత్యం వెలుగులోకి తేవాలనే కృషిలో ఉన్నాం.
సిరివెన్నెల సాహిత్యం చూసి ఇదీ మన ‘తెలుగు సంపద’ అంటూ ప్రతి తెలుగువాడి ఛాతీ గర్వంతో విశాలమవుతుంది.
సిరివెన్నెలతో నాకున్న వ్యక్తిగత సంబంధం - సంఘాలకి, సాహిత్య బంధాలకి అతీతమైన ఆత్మీయానుబంధం. బావ గారూ! అంటూ ఆయన నన్ను పలకరించిన ప్రతిసారీ అది నా హృదయాన్ని సూటిగా, మృదువుగా తాకేది.
రూపం లో చెరగని చిరునవ్వు, మాటల్లో స్వచ్ఛత, భావంలో భారతీయత, ఆలోచనల్లో సమతా మమతల కలబోత, ప్రతి పాటలో ఒక అర్ధం, పరమార్ధం చూపే తెలుగు వారి తరగని సిరి పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అజరామరం.
Check the below links for more details of Sirivennela Samagra Sahityam