ముప్పై ఏళ్ల కథాయాత్ర ఒక సాహసం
ముప్పై ఏళ్ల కథాయాత్ర ఒక సాహసం
కథ 2019 ఆవిష్కరణ

కథ వార్షిక సంకలనానికి ముప్పై వసంతాలు... ఇంతకాలం తెలుగులో నిరాటంకంగా ఒక వార్షిక కథాసంకలనం రావడం అరుదైన సందర్భం. ఈ కోవిడ్ కష్టకాలంలో ఆన్లైన్ వేదిక తప్ప అవకాశం లేని సమయంలో దాదాపు రెండు వందలమంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కథాభి మానులు వీక్షిస్తుండగా హైదరాబాద్‌లో ముప్పై మంది కథాభిమానులు, రచయితల మధ్య కథ 2019 ఆవిష్కరణ జరిగింది.
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాద కత్వంలో వెలువడుతున్న వార్షిక కథాసంకలనాల పరంపరలో ఇది ముప్పైవది. తానా ఆర్ధిక సహ కారంతో ఈ సంకలనాలు అతి తక్కువ ధరకు పాఠకు లకు అందుతున్నాయి.
ప్రతి ఏటా ప్రచురితమయ్యే వేలాది తెలుగు. కథల్లో అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి ఒక సంక లనంగా తీసుకురావడం ఒక ప్రయాసతో కూడుకున్న పని అని, అలాంటిది ముప్ఫయ్యేళ్లుగా ఈ యజ్ఞాన్ని నిర్విరామంగా కొనసాగించడం ఒక సాహసం అని సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కథా రచయిత వి. రాజారామమోహనరావు అన్నారు. ఇన్నేళ్లుగా ఈ సాహసాన్ని కొనసాగిస్తున్న కథాసాహితి సంపాదకులను ఆయన అభినందించారు.
సంపాదకుల్లో ఒకరైన వాసిరెడ్డి నవీన్ సభకు స్వాగతం పలుకుతూ ముప్పై ఏళ్ల అలుపెరుగని ప్రయాణాన్ని సంక్షిప్తంగా వివరించారు. ఇన్నేళ్లలో 413 మంది రచయితలు 30 సంకలనాలు 156 మంది కథకులు వెరసి కథాసాహితి సాహసయాత్రగా రూపు దిద్దుకుంటున్నదని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రముఖ కథా రచయిత ఆడెపు లక్ష్మీపతి మాట్లాడుతూ ముప్ఫయ్యేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో విమర్శలు కొన్ని తప్పకపోయినా విరామం లేకుండా ప్రచురణలు తీసుకువస్తున్నారని, ఈ కథాసంపుటాలకు మరింత శాశ్వతత్వం దక్కేలా మరికొంత కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సూచనలు చేశారు. కథల ఎంపికలో గెస్ట్ ఎడిటర్లను కూడా తీసుకోవాలని, అలాగే ఇప్పటివరకూ వచ్చిన కథా సంపుటులపై విశ్లేషణాత్మక వ్యాసాలతో ఒక పుస్తకాన్ని ప్రచురిస్తే బాగుంటుందని సూచించారు. అలాగే ఇప్పటివరకూ వచ్చిన సంకలనాలలో మంచి కథలను ఎంపిక చేసి వాటిని ఇంగ్లీషు భాషలోకి కూడా తర్జుమా చేస్తే, తెలుగు భాషా రచయితల గురించి ప్రపంచ భాషాభిమానులకు కూడా తెలిసే అవకాశం వుంటుందని సూచించారు.
ఈ మూడు దశాబ్దాల్లో కథ సంపుటాలు తీసుకు రావడంలో తెరవెనుక వ్యక్తులుగా ఉన్నటు వంటి అక్షర సీత, పరుచూరి సుబ్బయ్యలు కథ-2019ని ఆవిష్కరించారు.
తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు కన్నెగంటి చంద్ర మాట్లాడుతూ నిజానికి ఒక ఏడాదిలో వచ్చిన అన్ని కథలను చదివి, వాటిలో మంచి వాటిని ఎంపిక చేయడం అనేది ఎంతో ఓపికతో కూడుకున్న పని అని, అలాంటిది నవీన్, పాపినేని శివశంకర్‌లు ప్రతి ఏడాది ఈ పనిని ఎంతో ఓర్పుగా చేస్తూ గత ముప్పై ఏళ్లుగా కథాసంపుటులను తీసుకువస్తున్నారని ఆయన అన్నారు.
ప్రముఖ కథా రచయిత, సాహితీ సమీక్షకులు దాసరి అమరేంద్ర ఈ సంకలనంలోని కథలను సమీ క్షించారు. విలక్షణమైన నేపథ్యాలను ఎంచుకుని తెలుగులో మంచి కథలు వస్తున్నాయని ఆయన అభినందించారు.
శివశంకర్లాగా పుస్తక సంపుటి తీసుకురావడానికి పలువురు ప్రయత్నించారని, అయితే ఇలా నిరాటం కంగా ముప్పై ఏళ్లపాటు పుస్తక సంకలనం తీసుకు రావడం ఎవరికీ సాధ్యం కాలేదని అన్నారు.
కథ 2019 సంపాదకుల్లో ఒకరైన పాపినేని శివశంకర్ జూమ్‌లో మాట్లాడుతూ కథాసాహితి అంటే తాను, వాసిరెడ్డి నవీన్ మాత్రమే కాదని, దీని వెనుక ఎందరో ఉన్నారని, వారి కృషి దాగి వుందని, అలాగే ప్రతి ఏడాది తమను ఆదరిస్తున్న పాఠకులు కూడా దీని వెనుక ఉన్నారని అన్నారు.
అనంతరం కథాసంపుటిలో ఎంపికైన కథల రచయితలు తమ కథల నేపథ్యాన్ని, అనుభవాలను ఈ సందర్భంగా అందరికీ తెలియజెప్పారు. వీరిలో కొందరు ప్రత్యక్షంగాను. కొందరు ఆన్లైన్ ద్వారాను పాల్గొన్నారు