కథ 2021 ఆవిష్కరణ సభలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి
కథ 2021 ఆవిష్కరణ సభలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి
కరోనా కల్లోలం తర్వాత కాస్త ప్రశాంతంగా ఎటువంటి భయాందోళనలకు తావు లేకుండా స్వేచ్ఛగా కథ 2021 ఆవిష్కరణ సభ 17 డిసెంబర్ 2022న హైదరాబాద్ సారస్వత పరిషత్ హాలులో ఘనంగా
జరిగింది. ఈ కథా సంకలనాల ఆవిష్కరణ సభల్లో తానా అధ్యక్షులు పాల్గొనటం ఇదే మొదటిసారి. జంపాల చౌదరి సహకారంతో ఉత్తర
అమెరికా తెలుగు సంఘం తానా అందిస్తున్న ఆర్థిక సహకారం వల్ల ఈ సంకలనాలు పాఠకులకు అతి తక్కువ ధరకే లభ్యమవుతున్న
సంగతి తెలుగు సాహిత్యలోకానికి తెలిసిన విషయమే.
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాద కత్వంలో గత 32 సంవత్సరాలుగా నిరాటంకంగా వెలువడుతున్న కథాసాహితి వార్షిక
సంకలనాల పరంపరలో 32వ సంకలనం హైదరాబాదులో 17 డిసెంబర్ 2022న హైదరాబాదులోని ప్రముఖ సాహితీవేత్తల, పాఠకుల మధ్య ఆవిష్కరణ
జరిగింది.
సభికులకు, వక్తలకు ఆహ్వానం పలుకుతూ సంపాదకుల్లో ఒకరైన వాసిరెడ్డి నవీన్ 32 ఏళ్ల ప్రయాణాన్ని క్లుప్తంగా వివరించారు.
అనంతరం అధ్యక్షత వహించిన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ కథా సంకలనాల చరిత్రను
సోదాహరణంగా వివరిస్తూ, 32 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కృషిని అభినందించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తానా
అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తానా నిర్వహిస్తున్న సాహితీ కార్యక్రమాలను క్లుప్తంగా వివరించారు. ఇలా ఆర్థిక సహకారం
అందించడానికి తానాకు అవకాశం ఇచ్చిన కథాసాహితి వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. భవిష్యత్తులో ఇతర సాహితీ కార్యక్రమాలకు
తానా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సంకలనాన్ని ప్రముఖ సాహితీవేత్త, కథ, నవలా రచయిత, విమర్శకులు ముదిగంటి సుజాతా రెడ్డి ఆవిష్కరించారు. తనకు ఎంతో
గౌరవాన్ని ఇస్తూ ఈ సంకలనాన్ని ఆవిష్కరింపజేసినందుకు కథా సాహితికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కృషి ఇలాగే నిరంతరం
కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ సంకలనంలోని 15 కథల సారాంశాన్ని ఆ కథల్లోని వస్తు వైశిష్ట్యాన్ని, రూపవిన్యాసాన్ని హైదరా బాద్ సెంట్రల్ యూనివర్శిటీ
ప్రొఫెసర్ కె. సునీతా రాణి తమదైన ప్రత్యేక శైలిలో విశ్లేషించారు.
23వ తానా సభల కన్వీనర్ రవి పాట్లూరి సాహిత్యంతోను, సభ జరుగుతున్న ఈ హాలుతోను తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ
తానా సాహితీ కార్యక్రమాలను విశదీకరించారు. మరో విశిష్ట అతిథి కె. శివారెడ్డిగారు 32 ఏళ్లుగా కథాసాహితి సంకలనాలతోను,
సంపాదకులతోను తనకున్న అను బంధాన్ని, వారికి ప్రోత్సాహాన్నివ్వడానికి గల కారణా లను వివరించారు. ఈ సభలోనే మరో
సంపాదకులు. పాపినేని శివశంకర్ రచించిన సరళరేఖలు కథా సంపుటిని, లోయలు-శిఖరాలు కవితాసంపుటిని శివారెడ్డి
ఆవిష్కరించారు. తమ ప్రయాణంలోని ఒడిదుడుకులను అధిగమించటంలో సహకరించిన పాఠకులకు, ప్రముఖ సాహితీవేత్తలకు, విమర్శకులకు
మరో సంపాదకులు పాపినేని శివశంకర్ కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ సంకలనంలోని 15 కథకులలో పదిమంది. కథకులు పాల్గొన్న 'రచయితలతో ముఖాముఖి' కార్య క్రమాన్ని కథా పరిశీలకులు
ఎ.వి. రమణమూర్తి నిర్వ హించారు. ఈ రచయితలు తమ కథల నేపథ్యాలను క్లుప్తంగానే అయినా ఆహుతులను ఆ
కట్టుకునేట్టుగా ప్రసంగించారు.