సాహిత్య చరిత్రలో తప్పనిసరిగా ఒక స్పష్టమైన కాలంగా గుర్తించాల్సిన విషయం.
కథాసాహితి ప్రారంభమై 30 ఏళ్లు అవుతోంది. 1990 నుంచి నిరంతరాయంగా నిరాఘాటంగా కొనసాగుతోంది. ఇది నా సాహిత్య జీవితమంతకాలం. 1990 డిసెంబర్ లో నా మొట్టమొదటి కవిత ఆంధ్ర పత్రికలో ప్రచురితమైంది. ఆ సంవత్సరంలో వచ్చిన మంచి కథల్ని ఏరి కథాసాహితి రథసారథులు పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్ కథ 90 పేరుతో కథా సంకలనాలకు జన్మనిచ్చారు. ఈ 30 సంచికల ఆవిష్కరణ సందర్భాలలో కొన్నింటిలో నేనూ పాలు పంచుకున్నాను. కథ 97. కథ 98, కథ 2004, కథ 2009, రెండు దశాబ్దాలు కథ 1990-2009, కథ 2014, కథ 2019 కథాపండుగలలో నేను ఉత్సాహంగా పాల్గొన్నాను. కథ 98, 2004 2012 ఆవిష్కరణలు విజయవాడ సాహితీమిత్రులు ఆధ్వర్యంలో విజయవాడలో పెద్ద ఉత్సవంలాగా నిర్వహించాము. 2014 ఆవిష్కరణ సభ తెనాలిలో పెద్ద ఎత్తున సాహిత్యాభి మానులు, కళాశాల విద్యార్థుల మధ్య ప్రజ్వలిత ఆధ్వర్యంలో జరిగింది. ఆవిష్కరణ రోజే కథ కాపీలు దాదాపు 500కు పైగా అమ్ముడయ్యాయి. ఇవన్నీ తలచుకుంటే మనసు ఉద్వేగభరితం అవుతుంది. ఆ కారణంతోనే మన్నం సింధు మాధురి 2006 నుంచి ఇటీవలి వరకు కథ ఆవిష్కరణల ప్రయాణాన్ని తన జ్ఞాపకాల నుంచి అద్భుతంగా ప్రకటించారు. తెలుగు నాట రచయితలు, సాహితీమిత్రులు, అభిమానులు మొదలైనవారికి ఎందరికో ఈ కథాయాత్రలో గొప్ప అనుభూతి, జ్ఞాపకాలు ఉండి ఉంటాయి. ఎంతో మంది అభిమానులు కథ పుస్తకం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఈసారి ఎవరెవరి కథలు వస్తాయో అనే జిజ్ఞాసతో అందులో తాము అనుకున్న కథలకు చోటు ఉంటుందో లేదో అన్న ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. నేనైతే అలా ఎదురుచూడటంతో పాటు ప్రతి ఏడాది కథ సంకలనం వెలువడిన తర్వాత కొన్ని కాపీలు కొనడం, వాటిని మా పాఠశాలలో జరిగే పోటీ లలో విద్యార్థులకు బహుమతులుగా ఇవ్వడం చేస్తూ ఉంటాను. ఇరవై ఏళ్ల క్రితం ఈ బహుమతులు పొందిన విద్యార్థులు ఇప్పటికీ ఆ పుస్తకాల్ని భద్రంగా ఉంచుకోవడమే కాకుండా ఎప్పుడైనా కలిసినపుడు ఫలానా సంవత్సరంలో నాకు మీరు ఫలానా కథ పుస్తకం ఇచ్చారని అది పదిలంగా ఇప్పటికీ దాచు కున్నానని చెప్పటం కద్దు.
ఇక ఈ కథల ఎంపిక విషయానికి వస్తే ఆ సంపాదక మహాశయుల ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, ఎడతెగని చర్చలు. ఇవన్నీ ఒక ఎత్తయితే కథా సంకలనం వెలువడిన తర్వాత ఫలానా కథ ఎందుకు లేదని, ఫలానా కథ అంత గొప్ప కథ ఏం కాదు అయినా ఎందుకు వేశారనే విమర్శల దండయాత్రలు
సమాజం విడిపోయిన దారుల్లో సాహిత్యకారులు కూడా విడిపోయి ఉంటారు కాబట్టి అన్నింటికీ ప్రాతి నిధ్యం ఎందుకు లేదని దాడులు... వీటన్నింటినీ సమాధానపరుస్తూ ఈ కథలు మాత్రమే గొప్ప కథలు అని మేము అనడం లేదని, తమదైన కొన్ని సూత్రాలకు అనుగుణంగా ఈ కథల ఎంపిక జరిగిందని, కథ మాత్రమే ప్రాతిపదికగా ఈ కథల సంచికలు వెలువడు తున్నాయని సంపాదకులు ఎప్పటికప్పుడు ఎరుక పరుస్తూ ఉంటారు. అంతేకాదు ఇంకెవరైనా ఇటు వంటి పనిచేస్తే సంతోషిస్తామని, తాము వదిలేసిన లేదా తమ దృష్టికి రాని మరికొన్ని కథలు ఆయా సంపుటాల్లో వస్తే ఇంకా బాగుంటుందని అంటారు. అయితే గత 30 ఏళ్ల కాలంలో తెలుగు విశ్వవిద్యా లయం వారి తెలుగు కథ సంచికలు, తిరుపతి నుంచి కథవార్షిక సంచికలు, కథావేదిక, తెలుగు కథానిక, ప్రాతినిధ్య, తెలంగాణ కథలు మొదలైన పేర్లతో అనేక కథావార్షిక సంచికలను ఆయా సంస్థలు వెలువరిం చాయి, వెలువరిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో తెలుగు కథను అందలం ఎక్కించి ఊరేగించడంలో మొదట నిలిచింది కథాసాహితి సంస్థ.
కథ 2019 30 ఏళ్ల పండుగ ఉత్సాహభరితమైన వాతావరణంలో విజయవాడలో నిర్వహించాలని దానికి తగిన ఏర్పాట్లు చేయాలని నవీన్ చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. అయితే కరోనా కాలం కలిసి రానివ్వలేదు. చివరికి డిసెంబర్ 20వ తేదీ ఆదివారం నాడు సభావేదిక, అంతర్జాల జూమ్ వేదికల ద్వారా కథ 2019 ఆవిష్కృతమైంది. ఈ 30 ఏళ్లలో ప్రచురిత మైన 186 మంది కథకుల 413 కథల్ని పరిశీలిస్తే తెలుగు సమాజపు చారిత్రక పరిణామక్రమం కళ్లకు కట్టినట్లుగా మన ముందు ప్రత్యక్షం అవుతుంది. పత్రికలు, అప్పుడప్పుడు టీవీలు మాత్రమే ఉన్న కాలం నుండి అన్ని చేతిలోనే ఇమిడిపోయే సెల్ఫోన్లోకి వచ్చేసిన కాలం వరకూ, వర్గ దృక్పథం కాలం నుండి అస్తిత్వ పోరాటాల కాలం వరకూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాలం నుండి చిన్న కుటుంబం, అక్కడి నుండి ఏకవ్యక్తి కుటుంబం వరకు, రైతు జీవనం నుండి కార్పొరేట్ వ్యవస్థ వికృతరూపం వరకూ అనేక విషయా లలో తెలుగు సమాజం పొందిన అనేక మార్పులు ఈ కథల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థ లోని మూల సమస్యలలో కనబడని మార్పు. పై పై అంశాలలోనూ లేదా రూపం మార్చుకున్న సమస్యల లోను కనిపిస్తుంది. ఉదాహరణకు రైతు సమస్యను పరిశీలిస్తే కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, అతివృష్టి, అనావృష్టి, గిట్టుబాటు ధరలు మొదలైన సమస్యలు యధాతథంగా కొనసాగుతుండగా, వ్యవసాయంలో కార్పొరేట్ రంగం ప్రవేశించి విత్తనాల మీద పేటెంట్లు సంపాదించుకొని రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని వారికి పేటెంటు ఉన్న విత్తనాలు మరొకరు వాడ కూడదని, ఎవరైనా ఉపయోగిస్తే కోర్టుల ద్వారా వారికి జరిమానాలు విధించే పరిస్థితికి చేరడం మనం గమ నించవచ్చు. చేతివృత్తులు అడుగంటిపోగా వ్యవ సాయం మీద ఆధారపడ్డ అనేక వర్గాల ప్రజలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు ఆశపడి తమ జీవన విధా నాలను మార్చుకునే క్రమం కూడా మనకు కనబడు తుంది. అలాగే రాయలసీమలో నీళ్లు లేని స్థితిని, ఫ్యాక్షనిజంలో వచ్చిన మార్పులను కూడా మనం ఈ కథలలో గమనించవచ్చు. వర్తమాన సామాజిక చరిత్రను ఆధునిక కథ అందిస్తుంటే ఆ కథలను గుది గుచ్చి క్రమం తప్పకుండా అందించడం వల్ల కథా సాహితి, చరిత్ర గమనాన్ని రికార్డు చేస్తోంది అనడం సహేతుకమైనదే.
ఇక కథ 2019 విషయానికి వస్తే ఈ సంకల నంలో 17 కథలున్నాయి. వాటితో పాటుగా మరొక 24 కథలు ఆ సంవత్సరంలో వచ్చిన చదవదగ్గ మంచి కథలుగా సంపాదకులు పేర్కొన్నారు. వీటితో పాటు దేవరకొండ బాలగంగాధర తిలక్ శతజయంతి సంవత్సరం సందర్భంగా ఆయన 1965లో రాసిన దేవుడ్ని చూసినవాడు కథ కూడా ఇందులో చేర్చాడు. ఈ 17 కథలు ఈనాటి సమాజంలోని విభిన్న పార్శ్వా లను పాఠకుల ముందుకు తీసుకువస్తాయి.
ఈ సంకలనంలోని కథల కథాంశాలను పరిశీ లిస్తే రైతు జీవితం సమస్యల చుట్టూ అల్లిన కథలు ఐదు (నాలుగో ఎకరం, లోపలి చొక్కా, వేదవతి. వృద్ధి. ఇత్తనాల చెనిక్కాయలు వలుస్తూ), స్త్రీలు, స్త్రీల సమస్యలు, లైంగికాంశాల చుట్టూ పరిభ్రమించే కథలు ఆరు (కొట్రవ్వ, ఊపిరి, నేను... తను... అతను... నిశీధి శలభం, కేరాఫ్ బావర్చి, మిట్టమధ్యాహ్నం నీడ). ఆఫీస్ ఇంట్లోకి చొరబడకూడదనే కాలం నుంచి ఇల్లే ఆఫీస్ అయిన కాలానికి మారిన ఉద్యోగ జీవితాన్ని, తద్వారా ఉత్పన్నమవుతున్న జీవన సంబంధాల విచ్ఛిత్తిని ఆవిష్కరించిన కథ డబుల్నాట్. ఒకప్పుడు వామపక్ష భావజాలంతో వెలిగిన ఇల్లు తర్వాత వారసుల కాలంలో ఎలా మార్పు చెందిందో వివ రించిన కథ మధురాంతకం నరేంద్ర సావిత్రి ఇల్లు. అగ్రవర్ణాలలో ఆధిపత్యం కొనసాగించిన బ్రాహ్మణ వర్గంలోని పేదరికాన్ని అందులోనూ తక్కువగా చూడబడే శ్రాద్ధకర్మలు నిర్వహించే బ్రాహ్మణుల జీవన విధానాన్ని చూపించిన కథ చింతకింది శ్రీనివాసరావు కుర్రుపాట్ల పుణ్యతిథి. శ్రీకాళ హస్తి ప్రాంత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిం చిన కథ మునిసురేష్ పిల్లె తపసుమాను. పల్లెల్లోని దళితుల్లోకి క్రైస్తవ్యం చొచ్చుకు పోయాక పాస్టర్లు (మతబోధకులు) వారిని విడదీసి చోద్యం చూస్తున్న విపరీతధోరణిని వ్యక్తం చేసిన కథ ఇండ్ల చంద్రశేఖర్ దేహయాత్ర, ఈ సంకలనంలోని కథలలో ప్రత్యేకంగా చెప్పు కోవలసిన కథ శ్రీరమణ నాలుగో ఎకరం, దేశానికి అన్నం పెట్టే రైతు ప్రభుత్వాలు, కార్పొరేట్లు కలిసి తవ్విన ఊబిలో దిగబడిపోయాడు. కాలు చెయ్యి కదిలించలేని స్థితికి నెట్టబడ్డాడు. క్రమంగా వ్యవసాయ పనిముట్లు అయిన కాడి, మేడి, జడ్డిగం, నాగలి, బండి లాంటి వాటితోపాటు ఎడ్లకు అలంకరించే అనేకరకాల పట్టెడలు దాదాపుగా పురావస్తు ప్రదర్శనశాలలో చేరి పోయాయి. నా చిన్నతనంలో రెండో తరగతిలో ఒక కథ 'వుండేది. గ్రామంలో ఒక రైతు ఇంట్లో పెళ్లివేడుక జరగాలంటే గ్రామంలోని అన్ని వృత్తుల వారి సమష్టి కలయిక ఎలా ఉండేదో తద్వారా స్వయం పోషితగా గ్రామం ఎంత సుఖసంతోషాలతో ఉండేదో చెప్పే కథ అది. కానీ మారిన కాలంలో అటువంటి పరిస్థితి ఎక్కడా కనబడదు. గ్రామంలో వ్యవసాయం, వ్యవసాయ పనిముట్లు, పండుగలు, పబ్బాలు, ఎడ్ల పందాలు. వర్షం పడని కాలాన పండరి భజనలు, గుళ్ల లోని వేడుకలు- ఇలాంటి ఎన్నో అంశాలను ఈ కథలో రికార్డు చేశారు శ్రీరమణ. ముందు ముందు కనపడ కుండా పోయే వస్తువుల నుండి మానవ సంబంధాల వరకు ఈ కథలో ప్రక్షిప్తం చేశారు. కాని కాలం వచ్చి వ్యవసాయం మూలనపడి రియల్ ఎస్టేట్ రంగం వ్యవసాయ భూములలోకి అడుగు పెట్టిన తర్వాత చోటుచేసుకున్న డబ్బు సంబంధాలు- ఇటీవల రాజధాని అమరావతి ప్రాంత రైతుల స్థితిగతుల్ని గుర్తుకు తెచ్చాయి.
దాదాపుగా ఇటువంటిదే వ్యవసాయంలో వచ్చిన మార్పుల్ని, ప్రభుత్వపు రకరకాల పథకాల వల్ల రైతుకూలీలుగా ఉండే దళితుల జీవన విధానంలో వచ్చిన మార్పులు వ్యక్తం చేసిన కథ కొలకలూరి ఇనాక్ వృద్ధి. శ్రీరమణ కథలో పూర్తిగా గ్రామీణ వాతా వరణం ఉన్నప్పటికీ సంభాషణల్లో పెద్దగా మాండలిక భాష కనిపించదు. కానీ ఇనాక కథలో 'మాకేం గాడు బట్టింది? మేం రాం' అంటూ ప్రారంభించి 'ఆళ్లేమో నీడపట్టునుండాలా? మేమేమో ఎండనకా వాననకా పన్డేయాలా? మా వల్లగాడు పాండి' అనీ, 'ఓసి మీ దుంపల్లేగా' లాంటి పదాలతో కొంత స్థానికత కనబడు తుంది.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి లోపలి చొక్కా కథ వ్యవసాయవు తరానికి చెందిన రామయ్య తన కొడుకు అప్రయోజకుడుగా మారి, తాగి తందనా లాడుతూ ఇంటిని పట్టించుకోకుండా ఉంటే తాను ఇంట్లో ఉండలేక ఆశ్రమానికి వెళ్లిపోవాలని బయలు దేరి, కుటుంబ సంబంధాలు తెంచుకోలేక తిరిగి వచ్చే ఇతివృత్తంతో నడిచే కథ.
స్త్రీల సమస్యల్ని ప్రతిబింబించిన మన్నెం సింధు మాధురి కొట్రవ్వ, ఉమా నూతక్క మిట్ట మధ్యాహ్నం నీడ కథలు స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడి నేపథ్యంగా వచ్చిన కథలు. కొట్రవ్వ గొర్రెలు మేపు కుంటూ తిరిగే కురబజాతి స్త్రీ. కానికాలాన భర్త అనా రోగ్యంతో మంచానబడితే మరుదులు ఆమెను ఆక్రమించి భర్త కళ్ల ముందే అనుభవిస్తుంటే ఆమె పడిన మానసిక వేదన ఈ కథలో కళ్లకు కట్టినట్లు వర్ణించారు రచయిత్రి. అటువంటిదే ఉమా నూతక్కి కథ మిట్టమధ్యాహ్నపు నీడ. పసితనపు దేహంమీద జరిగిన లైంగికదాడి ఆ పసిమనసును ఎంతగా గాయ పరిచిందో తెలియజేసే కథ. కొట్టం రామకృష్ణారెడ్డి నేను... తను... అతను... కథ స్త్రీ మానసికస్థితిపై, ఇష్టా యిష్టాలపై భర్త చేసిన అణిచివేత, అతని అనంతరం, తను పోగొట్టుకున్న స్వేచ్ఛను హాయిగా అనుభవించడం లాంటివాటిని పాఠకుల ముందుకు తెస్తోంది.
విద్య, వైద్యం, సాంకేతికతల నుండి నిత్యావసర వస్తువుల దుకాణాల వరకూ కార్పొరేట్ రంగం ఎంతగా విస్తరించిందో మన కళ్ళముందు కదలాడే సత్యం. జి. ఉమామహేశ్వర్ పునరావృతం కథ రెండు ఐటి కార్పొరేట్ కంపెనీల మధ్య నడిచే ప్రచ్ఛన్న యుద్ధాన్ని, వారి మధ్యలోకి మూడవవాడు వచ్చి చొర బడకుండా పరోక్షంగా వారు చేసుకునే ఒప్పందాలు వివరించిన కథ. ఈ కథ చదువుతుంటే తెలుగునాట విద్యావ్యవస్థను ఆధీనం చేసుకున్న రెండు కార్పొరేట్ సంస్థల తీరుతెన్నులు గుర్తుకు వస్తాయి.
చివరిగా తిలక్ శతజయంతి సంవత్సరం సంద ర్భంగా ప్రచురించిన దేవుడ్ని చూసినవాడు తిలకను పునః పరిచయం చేసిన కథ. తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితాసంపుటితో కవిగా ఎంతటి ఉన్నత శిఖరా లను అధిరోహించాడో అదే స్థాయిలో ఊరి చివర ఇల్లు, సుందరి సుబ్బారావు, నల్లజర్ల రోడ్డు లాంటి ఆయన కథలు కనబడతాయి. గవరయ్య భార్య లేచి పోయింది అంటూ ప్రారంభమయ్యే ఈ కథలో గవరయ్య వ్యక్తిత్వాన్ని, గ్రామంలోని పెద్ద మనుషుల మానసిక స్థితిని అద్భుతంగా చిత్రిస్తూనే, చివరకు తిరిగి వచ్చిన భార్యను. ఆమె బిడ్డను, గవరయ్య దగ్గరకు తీసిన విధానం గొప్పగా వ్యక్తీకరిస్తాడు రచయిత.
తెలుగు కథాచరిత్రలో ఇప్పటికే సుస్థిర స్థానం సంపాదించుకున్న కథాసాహితి ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని తెలుగు కథ ఉన్నంతకాలం కథా సాహితి వారి కథాసంకలనాలు వెలువడుతూనే ఉండా లనే ప్రగాఢ ఆకాంక్షతో సంపాదకులకు అభినందనలు అందజేస్తున్నాను.
కథ మీద ఉన్న ప్రేమతో గత 20 సంవత్సరాల నుండి తానావారు కథాసాహితికి అందిస్తున్న ప్రోత్సాహం చాలా విలువైనది. వారి ప్రోత్సాహం వలన కథాసాహితి అతి తక్కువ ధరకు ఈ కథా సంకలనా లను అందిస్తోంది. ఒక పాఠకునిగా అందుకు తానా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
Do you need help? Just Email or call us
© 2023 Telugu Association of North America. All rights reserved.
Design & Developed by Arjunweb